: ట్రంప్ వస్తే... బంగారం, క్రూడాయిల్ క్రాష్... దివాలాలు, ట్రేడ్ వార్ ఖాయం: అయినా అతనే గెలుస్తాడంటున్న లెజండరీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలుస్తారని పలు సర్వేలు అంచనా వేస్తున్న వేళ, లెజండరీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ మాత్రం ట్రంప్ అధ్యక్షుడిగా వస్తే ఎన్నో పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. తాను ట్రంప్ గెలుస్తారనే భావిస్తున్నానని, అందువల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ లో షార్ట్ సెల్లింగ్ చేస్తున్నానని తెలిపారు. ఆయన గెలుపుతో యూఎస్ వాణిజ్య యుద్ధాలను, దివాలాను చూస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. క్లింటన్ గెలిచినా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, అయితే, కాస్త ఆలస్యంగా వస్తుందని అంచనా వేశారు. ట్రంప్ విజయంతో ముడిచమురు మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని, బంగారం ధరలు, క్రూడాయిల్ భారీగా పతనమవుతాయని రోజర్స్ అంచనా వేశారు. ఆర్థిక ఇబ్బందులు అమెరికాను చుట్టుముడతాయని, చైనాకూ ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయని అన్నారు. కొత్త పెట్టుబడులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి దీర్ఘకాల అవకాశాలు లభిస్తాయని అన్నారు. కమోడిటీ మార్కెట్ అందనంత ఎత్తునకు చేరుతుందని, ఇండియాపైనా ఈ ప్రభావం ఉంటుందని, అయితే, ఇండియాలో అమలవుతున్న సంస్కరణల కారణంగా కొంత ఉపశమనం లభిస్తుందని అన్నారు. కాగా, వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ లో హిల్లరీకి అనుకూలంగా 44 శాతం, ట్రంప్ కు అనుకూలంగా 40 శాతం, లిబర్టేరియన్ అభ్యర్థి గ్యారీ జాన్సన్ కు ఆరు శాతం, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ కు రెండు శాతం మంది మద్దతిస్తున్నట్టు వెల్లడైంది.