: మోదీ మా హీరో.. ఆయన ప్రస్తావనతోనే ప్రపంచానికి బలూచ్ దుస్థితి తెలిసింది!: కొనియాడిన ఖాద్రీ
బలూచిస్థాన్ జాతీయ నేత నయెలా ఖాద్రీ భారత ప్రధాని నరేంద్రమోదీని కొనియాడారు. బలూచ్ ప్రజల దుస్థితిని మోదీ ప్రస్తావించిన తర్వాతే ప్రపంచానికి తెలిసిందన్నారు. 70 ఏళ్లుగా బలూచ్ ప్రజలపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపుతోందని, చైనా అండతో మారణహోమం సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ‘‘బలూచిస్థాన్ ప్రజలు స్వాత్యంత్రం కోసం పోరాడుతున్నారు. అయితే చైనా అండతో పాక్ ఆర్మీ మారణహోమం సృష్టిస్తోంది. అమాయక ప్రజలను ఊచకోత కోస్తోంది. ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. 70 ఏళ్లలో ఎన్నో కష్టాలు అనుభవించాం. మానవహక్కులు అనేవే లేకుండా పోయాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ బలూచ్ ప్రజల దుస్థితి గురించి ప్రస్తావించాక ఈ విషయం ప్రపంచానికి తెలిసింది’’ అని ఖాద్రీ వివరించారు. బలూచ్ గురించి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లిన మోదీ తమ హీరో అని ఆమె కొనియాడారు. పాక్ ఆర్మీ సహనం కోల్పోయిందని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతోందని, మనుషులను చంపేసి వారి అవయవాలను అపహరిస్తోందని ఆమె ఆరోపించారు. భారత్ మద్దతుతో తమ స్వాతంత్ర్య పోరాటానికి మరింత ఊపు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.