: కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారి.. దీపావళి రోజున పూర్తిస్థాయి విధుల్లో సైనికులు
కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారి భారత సైనికులు దీపావళి రోజున సరిహద్దుల వద్ద పూర్తిస్థాయి విధుల్లో పాలుపంచుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడుల తర్వాత ఉడికిపోతున్న పాక్ ప్రతిరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. భారత సైనికుల పోస్టులు, అమాయక ప్రజలే లక్ష్యంగా మోర్టార్లతో దాడులకు దిగుతోంది. దీంతో పాక్ నుంచి ఎదురయ్యే ఎటువంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు అధికారులు సైనికుల సెలవులు రద్దు చేశారు. దీంతో 198 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దీపావళి రోజున భారత జవాన్లు విధులు నిర్వహించారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత దీపావళి రోజున సైనికులు సరిహద్దులో పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించడం ఇదే తొలిసారి. దీపావళి నాడు పాక్ నుంచి కాల్పులు పెద్దగా లేకపోవడంతో చాలామంది సైనికులు కేరమ్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ ఆడుతూ సేదతీరారు.