: జిల్లాల విభజన ముగిసింది.. ఇక అసెంబ్లీ స్థానాల పెంపుపై కేసీఆర్ వ్యూహరచన


జిల్లాల పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా పూర్తిచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇక నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఈ విషయంలో కేంద్రాన్ని వీలైనంత త్వరగా ఒప్పించాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. 16వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చేలా చూడాలని యోచిస్తున్నారు. నేటి నుంచే ఈ విషయంపై కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించిన సీఎం.. టీఆర్ఎస్ ఎంపీలు, కేంద్రమంత్రులను కలిసి చర్చించనున్నట్టు తెలుస్తోంది. శాసనసభ స్థానాల పెంపుపై ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. అయితే ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టత లేకపోవడంతో నియోజకవర్గాల సంఖ్య పెంపుకోసం దానిని సవరించాల్సి ఉందని కేంద్రం తెలిపింది. చట్టసరవణపై పార్లమెంటులో కేంద్రం హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో దీనిపై సీఎం దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముగియడంతో ఇక నియోజకవర్గాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. 16 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చేలా చూడాలని తమ పార్టీ ఎంపీలకు కేసీఆర్ ఇప్పటికే సూచించినట్టు సమాచారం. ఈ విషయంలో ఇప్పటి నుంచీ ప్రయత్నిస్తేనే 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది.

  • Loading...

More Telugu News