: ‘నా కారే తమరి వాహనం.. నేనే మీ డ్రైవర్ ని’ అని స్వామి వారితో అన్నాను: కేసీఆర్
‘నా కారే తమరి వాహనం.. నేనే మీ డ్రైవర్ ని’ అని నాడు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో అన్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న చినజీయర్ స్వామి షష్టి పూర్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ‘ఇరవై రెండు సంవత్సరాల క్రితం సిద్దిపేటలోని వికాస తరంగిణి కార్యకర్తలు... అక్కడ ఉన్న ఆధ్మాత్మిక సంపన్నులు నా దగ్గరకు వచ్చారు. మన పట్టణాన్ని అనుగ్రహించడానికి చిన్న జీయర్ స్వామి వారు వేంచేయడానికి అంగీకరించారని, బ్రహ్మయజ్ఞం నిర్వహించడానికి ఎమ్మెల్యేగా నా సహకారం కావాలని వారు నా దగ్గరకు వచ్చారు. ‘వారి రాక సిద్దిపేటకు శారద రాక’ అని వికాసతరంగిణి వారికి చెప్పాను. సంపూర్ణ సహకారముంటుందని చెప్పాను. స్వామి వారు ఇక్కడికి వస్తే, ఎవరి ఇంట్లో ఉండాలనే విషయమై అందరూ ఆలోచించారు. చివరకు, మా ఇంట్లోనే స్వామి వారు ఉన్నారు. వారం రోజుల పాటు ఉండే అదృష్టాన్ని స్వామి వారు నాకు కల్పించారు. అయితే, స్వామి వారిని సిద్దిపేటలోకి ఆహ్వానించగానే, ఆయనకు నేనొక ప్రార్థన చేసుకున్నాను. ‘మీరు, సిద్దిపేటలో ఉన్నన్ని రోజులూ నా కారే తమరి వాహనం.. నేనే మీ డ్రైవర్ ని. ఆ అవకాశం నాకు ఇవ్వాలి’ అని స్వామి వారిని కోరాను. వారు దయతో అంగీకరించారు. సిద్దిపేటలో ఉంటూ పరిసర ప్రాంతాల ఆలయాలకు వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆ సమయంలో స్వయంగా నేను కారు డ్రైవ్ చేస్తూ, కలిసి వెళ్లే వాళ్లం’ అని సీఎం కేసీఆర్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.