: నాకు మీ అందరి అండదండలూ కావాలి: జగన్
‘ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే.. జగన్ కు మీ అందరి అండదండలు కావాలి. ఏపీ ప్రజలారా, ఏకమవ్వండి. పోరాటం ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యం' అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విశాఖ సభలో పిలుపు నిచ్చారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేయడం కోసం సీఎం పరితపించాలి కానీ, మన సీఎం మాత్రం ఇక్కడెందుకు పుట్టాలని ప్రశ్నిస్తారని, తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుట్టేవాళ్లమంటారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఏ ప్యాకేజీ ఇవ్వకపోయినా ఇచ్చారని అబద్ధాలు చెబుతున్నారని, మన రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తి మనకే వెన్నుపోటు పొడిచాడని అన్నారు. టీడీపీని తెలుగుదేశం ద్రోహుల పార్టీగా చంద్రబాబు మార్చారని, ఎన్టీఆర్ కనుక బతికుంటే.. చంద్రబాబు చేస్తున్న పనిని చూసి ఎన్టీఆరే కాకుండా ఆయన ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునేదన్నారు. ఉద్యోగాల కోసం ఇక్కడియువత వేరే రాష్ట్రాలకు తరలిపోకుండా మన రాష్ట్రంలోనే మంచి జీతాలతో ఉద్యోగం చేయడమే ప్రత్యేక హోదా అని, ఉద్యోగాలు మన ప్రాంతాలకు, మన జిల్లాలకు రావడమే ప్రత్యేక హోదా అని, ఇలాంటి హోదా తీసుకురావాలని సీఎం చంద్రబాబుకు, ఆ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. అలాంటప్పుడు చేతులు కట్టుకుని మనం కూర్చోవాలా? అని ప్రశ్నించారు. ఉద్యమాలన్నా, ప్రాణాలన్నా భయం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామని అన్నారు.