: పిల్లలతో కలిసి కువైట్‌లో యాచిస్తున్న కడప మహిళ అరెస్ట్.. పొట్టకూటికోసం వచ్చి మతిస్థిమితం కోల్పోయిన బాధితురాలు


పొట్టకూటి కోసం కువైట్ వచ్చి మోసపోయి, మతిస్థిమితం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలతో కలిసి రోడ్డుపై భిక్షాటన చేస్తున్న ఆమెను తనిఖీల్లో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని కొండారెడ్డిపాడుకు చెందిన మస్తానమ్మ అలియాస్ సావిత్రమ్మ, అలియాస్ రేవతిగా ఆమెను గుర్తించినట్టు సమాచారం. హవళ్లి ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న మస్తానమ్మను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి వేలిముద్రల ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె వీసా గడువు నాలుగేళ్ల క్రితమే ముగిసిందని, వెంట ఉన్న ఇద్దరు పిల్లల వివరాలు వీసాలో లేవని పోలీసులు తెలిపారు. అసలు పిల్లల తల్లి ఆమేనా? అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. అదుపులో ఉన్న పిల్లలకు పోలీసులు ఆహారం అందించి ఆస్పత్రికి తరలించారు. కువైట్‌లోని మహిళ యజమాని హమీద్ అల్ సఘీర్‌ను పిలిపించి మాట్లాడారు. మస్తామ్మను భారత్ పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా కువైట్‌లో మస్తానమ్మ దుస్థితిపై గతంలోనే వార్తలు వచ్చాయి. ఆమె దీనగాథ తెలిసిన చాలామంది సాయం చేసేందుకు ప్రయత్నించినా ఆమె మతిస్థిమితం కోల్పోవడంతో సాయం కష్టంగా మారింది.

  • Loading...

More Telugu News