: హిల్లరీ, ట్రంప్ ల గుండెల్లో టిక్..టిక్..టిక్...!


నెలలు వారాలయ్యాయి. వారాలు రోజులయ్యాయి. రోజులు గంటల్లోకి వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 48 గంటల్లో జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తూ, ఫలితాల కోసం వేచి చూస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి రెండు వారాల క్రితం ఉన్న పరిస్థితులను గమనిస్తే, అధ్యక్ష ఎన్నికలు హిల్లరీ క్లింటన్ కు నల్లేరుపై నడకే అన్నట్టుగా కనిపించినప్పటికీ, ఆపై జరిగిన పరిణామాలు ఎన్నికలను 'బిగ్ ఫైట్'గా మార్చేశాయి. ఓ దశలో దాదాపు 9 శాతం తిరుగులేని ఆధిక్యంతో ఉన్న హిల్లరీ, ఈ వారం ప్రారంభంలో ఒక శాతం వెనక్కు వెళ్లిందంటే, ప్రజల మైండ్ సెట్ ఎంతగా మారిందో అర్థం చేసుకోవచ్చు. మహిళలపై తన అసభ్య కామెంట్లతో అధ్యక్ష పీఠానికి దూరమయ్యాడని భావించిన ట్రంప్, అనూహ్యంగా రేసులో దూసుకొచ్చి హిల్లరీ పక్కనే నిలిచి, నువ్వా? నేనా? అన్న తరహాలో పోటీని ఇస్తున్నారు. ఇక ట్రంప్ గెలిస్తే ఘోరం జరిగిపోతుందన్న తరహాలో ఇప్పటికే వరల్డ్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మొదలైపోయింది. బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ట్రంప్ విజయాన్ని ఏ ప్రపంచ దేశమూ కోరుకోవడం లేదన్న సంకేతాలు వస్తున్నాయి. తాజా ఎన్నికల పోల్ సర్వేలో హిల్లరీ మూడు శాతం ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, ఆమెకు అధ్యక్ష పదవికి అవసరమైన పూర్తి ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్లు వస్తాయని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల తరఫున బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ల గుండెల్లో లబ్ డబ్ శబ్దాలకు బదులు గడియారం టిక్ టిక్ శబ్దం వినిపిస్తోందనడంలో అతిశయోక్తి లేదేమో!

  • Loading...

More Telugu News