: ‘స్ఫూర్తి’.. ఆడపిల్లకు జన్మనిచ్చిన కోడలు... సంతోషంతో హోండా సిటీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన అత్తగారు!
ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెలపై కుంపటిలా భావిస్తుంటారు కొందరు. కొడుకు కన్నా కూతురే మిన్న అని ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఆడపిల్లలను తల్లికడుపులోంచి రానివ్వకుండా కడుపులోనే చంపేసే ప్రయత్నాలు చేస్తుంటారు. మగపిల్లాడు పుట్టడానికైనా, ఆడపిల్ల పుట్టడానికైనా పురుషుడే కారణమని డాక్టర్లు చెబుతున్నా ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోడలిని చిత్రహింసలు పెడుతుంటారు కొందరు అత్తలు. ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పుర్ జిల్లాలో మాత్రం ఓ అత్త మంచి పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆడపిల్లను కన్నదని తెలిసి తన కోడలికి పెద్ద గిఫ్టు ఇచ్చింది. తన కోడలు కుష్భూ ఆడపిల్లకు జన్మనిచ్చిందని తెలుసుకున్న ప్రేమాదేవి అనే ఓ అత్త ఎంతగానో హర్షం వ్యక్తం చేసింది. తన పేరుకు తగ్గట్లుగానే ప్రవర్తించి తన మనవరాలిపై ఎంతో ప్రేమను కురిపించింది. వెంటనే ఓ కారును తన కోడలకి బహూకరిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, బంధుమిత్రులను ఇంటికి పిలిచి ఫంక్షన్ కూడా చేసింది. తమ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అంబరమంత ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రేమాదేవి ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైరయ్యారు. తన కోడలికి హోండా సిటీ కారును గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు ప్రకటించింది.