: పేద‌రికంపై గెలుపు మీతోనే సాధ్యం.. వేరెవ‌రితోనూ సాధ్యం కాదు: కర్నూలులో మహిళలతో చంద్రబాబు


ఆడ‌పిల్లంటే వంటింటికే ప‌రిమితం కావాల‌నే ప‌రిస్థితి పూర్తిగా తొల‌గిపోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న ఆయ‌న అక్క‌డ‌ డ్వాక్రా సంఘాల స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం డ్వాక్రా మ‌హిళ‌ల పొదుపు సంఘాల బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ఆడ‌వారికి ఏం తెలియ‌దులే అన్న పరిస్థితి నుంచి ఎంతో సాధించి నిరూపించార‌ని చెప్పారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ని అన్నారు. తాను ఒక్క‌టే ఆలోచించానని, జ‌నాభాలో సగభాగం ఉండే మ‌హిళ‌లు స‌మాజంలో పై చేయి సాధిచాల‌న్నదే త‌న‌ ఆలోచ‌న అని చంద్రబాబు అన్నారు. డ్వాక్రా మ‌హిళ‌లు ఒక‌ పెద్ద సైన్యంలా ఏర్ప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు. మ‌హిళ‌లు ఏది అనుకుంటే అది సాధిస్తారని ఆయ‌న పేర్కొన్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాలు ఇస్తుంటే... ప‌సుపు కుంకుమ కింద నిధులు మంజూరు చేస్తున్న‌ట్లు ఉంద‌ని అన్నారు. పేద‌రికంపై గెలుపు మ‌హిళ‌లతోనే సాధ్యం, వేరెవ‌రితోనూ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మ‌హిళ‌ల‌కు ఇచ్చే రుణాల‌ను స్వేచ్ఛగా ఉపయోగించుకోవాల‌ని సూచించారు. సాధారణ మహిళల్లో అసాధారణ శక్తి ఉందని అన్నారు. అది సంఘటిత శక్తిగా మారుతోందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News