: చైనాపై సర్జికల్ దాడులు జరిపే అవకాశం ఉందా?: కేంద్రాన్ని ప్రశ్నించిన శివసేన
ఇటీవల లడఖ్ లోకి చైనా బలగాలు చొచ్చుకొని వచ్చినట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో, చైనాపై సర్జికల్ దాడులు నిర్వహించే అవకాశం ఉందా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన ప్రశ్నించింది. పాకిస్థాన్ పై నిర్వహించిన సర్జికల్ దాడులకు తామెంతో సంతోషించామని... చైనాపై కూడా ఇదే రీతిలో దాడులు చేస్తారా? అంటూ తన పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. కేంద్ర రక్షణ మంత్రి పారికర్ కు డబ్బా కొట్టుకోవడం అలవాటని... చైనా చొరబాట్లకు సంబంధించి మన సైనికులు ఏం చర్యలు తీసుకున్నారో డబ్బాలు కొట్టుకునే మంత్రి చెప్పాలని ఎద్దేవా చేసింది. కేవలం పాకిస్థాన్ పై దాడి చేస్తే సరిపోదని... చైనాతో ఉన్న సరిహద్దులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పారికర్ పై ఉందని శివసేన చెప్పింది. ఇతర సరిహద్దులను పట్టించుకోకుండా... కేవలం పాక్ సరిహద్దు వద్ద మాత్రమే నిఘా పెంచితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. చైనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.