: హైదరాబాద్‌లో గోడలపై రాతలు రాసే వారిపై కఠిన చర్యలు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ రోజు తెలంగాణ కళాకారుల మేళ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ అందమైన నగరమని, ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని చెప్పారు. నగరంలో గోడలపై రాతలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. తమ పార్టీ నేతలైనా సరే గోడలపై రాతలు రాసి వాటిని పాడుచేస్తే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ స్వరూపాన్నే కళాకారులు మార్చేస్తున్నారని, వారికి ఆటంకాలు కలిగించకూడదని అన్నారు. నగరం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రపంచంలోని ఐదు మేటైన కంపెనీలు కొలువయ్యాయని పేర్కొన్నారు.