: బంగ్లాదేశ్ లోని హిందువులపై పెరుగుతున్న ముస్లింల దాడులు
బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులకు రక్షణ లేకుండాపోతోంది. వారిపై దాడులు ఎక్కువవుతున్నాయి. గత నెల 30వ తేదీన ముస్లిం మతానికి చెందిన 3వేల మంది ఓ హిందూ గ్రామంపై మూకుమ్మడిగా దాడి చేసి 10 హిందూ దేవాలయాలను, వందలాది ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో, దాదాపు 100 మంది హిందువులు తీవ్రంగా గాయపడ్డారు. మత్స్యకారుడైన రసరాజ్ దాస్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేశాడని దాడికి పాల్పడ్డ దుండగులు ఆరోపించారు. అయితే, తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసి ఆ పోస్టులు పెట్టారని రసరాజ్ వాపోయాడు. అంతేకాదు, ముస్లింలకు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ, అతడిని దుండగులు తీవ్రంగా కొట్టి, పోలీసులకు అప్పగించారు. అధికార అవామీలీగ్ పార్టీకి రసరజ్ మద్దతుదారుడు. మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు కూడా విధ్వంసకాండ జరిగిన గ్రామంలో పర్యటించారు. మైనారిటీలైన హిందువుల భూములను లాక్కోవడానికే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ఆ ప్రతినిధులు తెలిపారు. ఇదే క్రమంలో, శుక్రవారం నాడు కూడా ఈ మూకలు మళ్లీ విరుచుకుపడ్డాయి. మధ్యపడ, దక్షిణ్ పఢ గ్రామాల్లో హిందువులపై దాడి చేశాయి. ఇళ్లను తగలబెట్టాయి. అయితే ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదని పోలీసు సూపరింటెండెంట్ మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు.