: ఎన్ఎస్జీ కమెండోకు చంద్రబాబు రూ. 10 లక్షల సాయం
పఠాన్ కోట్ ఉగ్రదాడిలో గాయపడ్డ ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమెండో శ్రీరాములుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 10 లక్షల సాయం అందించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో పాక్ ఉగ్రవాదులను కాల్చి చంపిన అనంతరం... బాంబును నిర్వీర్యం చేస్తుండగా, ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ఘటనలో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. కోమాలోకి వెళ్లి ఇటీవలే కోలుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుడు శ్రీరాములు. ఈ నేపథ్యంలో, గత నెల 25న విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో తన కుటుంబ సభ్యులతో వచ్చి చంద్రబాబును కలిశారు శ్రీరాములు. అతని పరిస్థితిని చూసి చలించిపోయిన చంద్రబాబు... అప్పటికప్పుడు రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతోపాటు, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు తన నివాసానికి వచ్చిన శ్రీరాములుకు చంద్రబాబు రూ. 10 లక్షల చెక్ అందజేశారు.