: రైలు ఒకటే.. చార్జీలు రెండు.. ఈస్ట్‌కోస్ట్ జోన్ నిర్వాకం!


సాధారణంగా రైలు ఏదైనా ఎప్పుడు ప్రయాణించినా ఒకే రకమైన టికెట్ ఉంటుంది. తూర్పుకోస్తా జోన్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక రైలుకు రెండు రకాల చార్జీలు వసూలు చేస్తూ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. బెంగళూరు-విశాఖపట్టణం మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ రైలుకు బెంగళూరు నుంచి విశాఖకు తత్కాల్ చార్జీలు వసూలు చేస్తుండగా, తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి బెంగళూరుకు సువిధ(డైనమిక్) చార్జీలు వసూలు చేస్తోంది. దీంతో ప్రయాణికుల జేబులు కరిగిపోతున్నాయి. బెంగళూరు-విశాఖపట్నం మధ్య రద్దీని తట్టుకునేందుకు సౌత్ వెస్టర్న్ రైల్వే ఈ వీక్లీ రైలును ప్రవేశపెట్టింది. రెండు మూడు నెలల తర్వాత దీనిని రెగ్యులర్ రైలుగా మార్చాలని అనుకుంది. అప్పటి వరకు తత్కాల్ చార్జీలు వసూలు చేయాలని భావించింది. ఇదే విషయాన్ని ఆ రైలు ప్రయాణించే అన్ని జోన్లకు తెలిపింది. రెగ్యులర్ రైలు చార్జీలతో పోలిస్తే తత్కాల్‌లో రూ.110 అధిక చార్జీ వసూలు చేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ రైలు తిరుగు ప్రయాణం ప్రారంభమయ్యే విశాఖపట్నం ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో ఉంది. ఇక్కడి అధికారులు ఈ రైలును సువిధ రైలుగా తమ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయించడంతో అసలు సమస్య మొదలైంది. సువిధ రైళ్ల చార్జీలు విమాన చార్జీలను పోలి ఉంటాయి. టికెట్లు అయిపోతున్న కొద్దీ చార్జీలు పెరుగుతుంటాయి. మొదటి టికెట్ తీసుకున్న వారి కంటే చివరి టికెట్ తీసుకున్నవారు 50 నుంచి 200 శాతం వరకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రైలుకు రెండు రకాల చార్జీల వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రైలుకు అంతగా ఆదరణ లేదని చెప్పేందుకే ఈస్ట్‌కోస్ట్ జోన్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News