: పాక్‌ను మరోసారి చావుదెబ్బ తీసిన భారత సైన్యం.. శత్రు శిబిరాలపై విరుచుకుపడి, 20 మందిని మట్టుబెట్టిన ఆర్మీ
పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమాయక పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్‌ను భారత్ మరోమారు చావుదెబ్బ కొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై శతఘ్నులతో విరుచుకుపడింది. నాలుగు శిబిరాలను ధ్వంసం చేసి 20 మంది పాక్ సైనికులను హతమార్చింది. గతనెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచ్చిల్ సెక్టార్‌లో ఇటీవల ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి వచ్చి భారత సైనికుడి తల నరికిన సంగతి తెలిసిందే. కాల్పులతో ఉగ్రవాదులకు పాక్ బలగాలు సహకరించాయి. ఈ ఘటనతో ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న భారత బలగాలు గత నెల 29న పాక్ బలగాలపై విరుచుకుపడ్డాయి. శతఘ్నుల మోతతో వారిని బెంబేలెత్తించాయి. భారత్ కాల్పుల్లో నాలుగు పాక్ సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్మీ పోస్ట్ హెడ్ క్వార్టర్ నేలమట్టమైంది. ఈ ఘటనలో 20 మంది శత్రుదేశ సైనికులు హతమయ్యారు. కాగా చనిపోయిన పాక్ సైనికుల సంఖ్య 40 మంది అని తెలుస్తోంది. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్ శతఘ్నులను ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆర్మీ కూడా నిర్ధారించింది.