: వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న చంద్రబాబు.. జన చైతన్య యాత్రలే వేదిక!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికలపై దృష్టిసారించారా? ప్రస్తుతం ఆయన జనచైతన్య యాత్రల షెడ్యూల్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జన చైతన్య యాత్రల్లో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష హోదాలో చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన తనయుడు లోకేష్ రాష్ట్రాన్ని చుడుతున్న తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈ నెల 1న మొదలైన జనచైతన్య యాత్రల టూర్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. నేడు ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. వచ్చే శనివారం (12వ తేదీన) శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఈ మధ్యలో లోకేశ్ వరుసగా మూడు రోజులు కోస్తా జిల్లాల్లో పర్యటిస్తారు. 9న పశ్చిమ గోదావరి జిల్లాలో, 10న కృష్ణా, 11న గుంటూరులో లోకేష్ పర్యటించనున్నారు. ఆ తర్వాతి వారంలో మరికొన్ని జిల్లాలను చుట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌లో శాసనమండలి, పురపాలక, స్థానిక ఎన్నికలు జరిగే ప్రాంతాలపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు తోడు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో శాసనమండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. తర్వాత కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు జన చైతన్యయాత్రల టూర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన తొలుత యాత్రలను ఒంగోలులో ప్రారంభించారు. చంద్రబాబు ప్రతి పర్యటనలో ఓ చోట జనచైతన్య యాత్రలో, మరోచోట పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటుండడం ఆయన ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారనడానికి నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు.