: కట్టుబాట్లు కడుపు నింపవు: ఈ-రిక్షా నడుపుతున్న తొలి ముస్లిం మహిళ


బతుకు బండి సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో తన భర్త కోసం తాను కష్టించి పనిచేసిన డబ్బులతో ఒక ఈ-రిక్షాను కొనుగోలు చేసిన భార్య కలలు కల్లలయ్యాయి. కొన్ని రోజులు ఈ-రిక్షాను నడిపిన భర్త, ఆ రిక్షానే తాకట్టు పెట్టి మద్యం సీసాలు తెచ్చుకోవడం మొదలెట్టాడు. కుటుంబం గడవటం లేదే అని చెప్పి కుంగిపోని ఆ మహిళ కుటుంబ బాధ్యతలను తానే స్వీకరించింది. సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్న ఈ సమాజంలో తాను ఈ-రిక్షాను నడపక తప్పలేదంటున్న ఢిల్లీకి చెందిన ఆ ముస్లిం యువతి పేరు సయ్యదా నస్రీన్. ఢిల్లీలోని కర్కాడుమ్ ప్రాంతానికి వెళ్తే ఈ-రిక్షాతో ఆమె కనిపిస్తుంది. పంజాబీ డ్రెస్ లో తలకు స్కార్ఫ్ ధరించి ఉండే నస్రీన్, కర్కాడుమ్ మెట్రో స్టేషన్ నుంచి జిల్లా కోర్టు వరకు ఈ-రిక్షా సర్వీసు తిప్పుతుంటుంది. ఏకైక మహిళా ఈ-రిక్షా డ్రైవర్ అయిన నస్రీన్ వాహనంలో ప్రయాణించడానికే అధిక శాతం మహిళా ప్రయాణికులు ఆసక్తి చూపుతుంటారు. అయితే, తమ గిరాకీ పోతోందంటూ మగ ఆటో డ్రైవర్లు కొంచెం బాధపడుతుంటారు. ఈ విషయమై నస్రీన్ ను ప్రశ్నిస్తే.. పొట్టకూటికోసం, తన పిల్లల్ని పోషించుకోవడం కోసం అందరిలాగానే తాను కష్టపడాల్సి వస్తోందని చెబుతోంది. ఆమె నేటి మహిళ మరి!

  • Loading...

More Telugu News