: ఆ పరిస్థితి ఒక వింతగా అనిపించింది.. మోదీ అంటే దేశమా?: 'కన్నయ్య' రాసిన పుస్తకంలో పలు విషయాలు వెల్లడి
జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్యకుమార్.. తమ వర్సిటీలో నిర్వహించిన ఓ సభలో దేశవ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలపై జైలుకి వెళ్లి ఆపై బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఓ పుస్తకాన్ని రాశాడు. కేసులో తాను అనుభవించిన సంఘటనలపై వివరిస్తూ ‘బీహార్ టు తీహార్’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకంలో తనను పోలీస్‌స్టేషన్‌లో ఓ చిన్న రూంకి పోలీసులు తీసుకెళ్లినట్లు, అక్కడ తనను పోలీసులు పలు ప్రశ్నలు వేసినట్లు చెప్పాడు. తనను రూంలోకి తీసుకెళ్లిన వ్యక్తి తనతో మర్యాదకరంగానే మాట్లాడాడని అయితే, అనంతరం వచ్చిన ఓ పోలీసు మాత్రం దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తావా? అంటూ గట్టిగా ప్రశ్నించాడని చెప్పాడు. తనకు ఆ పరిస్థితి ఒక వింతగా అనిపించిందని చెప్పాడు. దేశం గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడాను? అని తాను మనసులో అనుకున్నట్లు కన్నయ్య తన పుస్తకంలో చెప్పాడు. తాను ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మాట్లాడితే ఇలా అడుగుతున్నారేంటీ? అని అనిపించిందని, మోదీ ఒక దేశంలా మారారా? అని తాను అనుకున్నట్లు చెప్పాడు. అప్పుడే తనకు ఏదో తప్పు జరిగిందని అనుమానం వచ్చిందని పేర్కొన్నాడు. తనని ఎందుకు అరెస్ట్ చేశారని, అరెస్ట్ వారెంట్ ఉందా? అని తాను పోలీసులను అడిగినట్లు చెప్పాడు. అందుకు ఓ పోలీసు సమాధానంగా అరెస్ట్ వారెంట్‌తో పాటు అన్నీ జైలులో తనకు లభిస్తాయి అంటూ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు. అనంతరం ఆ పోలీసు తనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే విషయమై ఫోనులో ఎవరితోనో మాట్లాడాడని చెప్పాడు. ఆ సమయంలో తన తండ్రి ఫోన్ నెంబరు అడిగి తీసుకున్నాడని కన్నయ్య చెప్పాడు. తన నాన్నతో పోలీసులు మీ అబ్బాయిని దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేశామని చెప్పాడని, తనను అరెస్ట్ చేయడానికి కారణం తనకు అప్పుడు అర్థమైందని, ఆ సమయంలో తనకు చాలా బాధకలిగిందని పేర్కొన్నాడు. అనంతరం తనను ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారని చెప్పాడు. అయితే, అక్కడ తనకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయలేదని, ఏదో పేపర్ వర్క్ చేసుకుంటూ వారంతా ఉన్నారని చెప్పాడు. పోలీసులు వైద్యుడిని కూడా తన వద్దకు రానివ్వలేదని పేర్కొన్నాడు. అనంతరం తనను కోర్టుకి తీసుకెళ్లినట్లు చెప్పాడు. తాను కోర్టుకి వెళ్లడం అది మొదటి సారని చెప్పాడు. కోర్టులో పోలీసులు తనపేరు కన్నయ్య అని చెప్పి, తాను దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశానని చెప్పారని కన్నయ్య పేర్కొన్నాడు. అఫ్జల్ గురు పుట్టినరోజు వేడుకలను వర్సిటీలో నిర్వహించారని ప్రధాన న్యాయమూర్తికి పోలీసులు చెప్పారని అన్నారు. దీంతో న్యాయమూర్తితో తాను మాట్లాడుతూ పోలీసులు అంతా అబద్ధాలు చెబుతున్నారని చెప్పినట్లు పేర్కొన్నాడు. ఓ అధికారి కోర్టులో పలు వీడియోలు ఆధారాలుగా చూపించారని చెప్పాడు. తన తరఫున వాదించడానికి న్యాయవాది లేడని చెప్పాడు. తనకు తెలీకుండానే, వారెంట్ లేకుండానే పోలీసులు తనను అరెస్ట్ చేశారని న్యాయమూర్తికి తాను చెప్పానని అన్నాడు. తానో విద్యార్థినని, తనకు ఇబ్బందులు ఉన్నా వర్సిటీలో సీటు సంపాదించానని, తాను సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం పోరాడానని కన్నయ్య చెప్పాడు. తాను సర్కారుకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానే కానీ, దేశానికి వ్యతిరేకంగా చేయలేదని జడ్జికి చెప్పినట్లు పేర్కొన్నాడు. తన వాదన విన్న జడ్జి ఆ వెంటనే సదరు అధికారి కోర్టులో ఉంచిన వీడియోను తనకు చూపించమన్నారని, అందులో తాను అసలు లేనని పేర్కొన్నాడు. వీడియోలో నినాదాలు వినిపిస్తున్నాయని, కానీ అవి టీవీలో చూపించినవి కావని జడ్జికి చెప్పినట్లు పుస్తకంలో రాశాడు. దీంతో న్యాయమూర్తి.. కన్నయ్య ఆ వీడియోలో లేడని, అటువంటప్పుడు ఎక్కడ నినాదాలు చేశాడని వ్యాఖ్యానించారని కన్నయ్య పుస్తకంలో పేర్కొన్నాడు.