: చిన్నారిని చంపేసిందన్న కోపంతో.. చిరుతపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు!
ఓ చిరుతపులిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ సమీపంలోని వాడి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, గత కొన్ని రోజులుగా ఈ గ్రామంలో చిరుత సంచరిస్తోంది. ఈ నెల 1వ తేదీన ఆ గ్రామానికి చెందిన ఓ బాలికపై ఆ చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి మరుసటి రోజున ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, గ్రామ సమీపంలో బోనును ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. ఇవాళ ఆ చిరుత బోనులోకి వచ్చింది. ఇప్పటికే చిరుతపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు... దానిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. బోనులోనే ఆ చిరుత చనిపోయింది. మరోవైపు, జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.