: లోథా కమిటీ సిఫార్సుల ఎఫెక్ట్.. సందిగ్ధంలో భారత్, ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా ఈనెల 9 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) లోథా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేమని చెప్పింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఖర్చులను బోర్డు భరించలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాస్తూ ఇంగ్లండ్ క్రికెటర్ల హోటల్, ప్రయాణ ఖర్చులను వారే పెట్టుకోవాలని లేఖ రాసింది. దీంతో ఈ ప్రభావం భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లపై పడే అవకాశం ఉంది. ఇటీవలే బోర్డుకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, లోథా కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని బీసీసీఐ హామీ ఇచ్చే వరకు ఆర్థిక లావాదేవీలు నిలుపుదల చేయాలని చెప్పిన విషయం తెలిసిందే. ఒకవేళ తాము ఇంగ్లాండ్ ఆటగాళ్ల బిల్లులు చెల్లిస్తే ఆ మొత్తం బోర్డుకు తిరిగివ్వాలని బీసీసీఐ పేర్కొంది. అయితే, ఈసీబీ ప్రతినిధి మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే భారత్, ఇంగ్లండ్ సిరీస్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే, లోథా ప్యానెల్, బీసీసీఐ మధ్య వివాదం మరింత చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నట్లు, ఈ ప్రభావం సిరీస్ పై పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిధులు విడుదల కాకపోతే సిరీస్ నిర్వహించడం సాధ్యం కాదంటూ బీసీసీఐ లోథా ప్యానెల్‌ని విమర్శిస్తోన్న నేపథ్యంలో స్పందించిన కమిటీ, ఇంగ్లండ్‌తో సిరీస్ రద్దు అయితే, దానికి కారణం తమది కాదని, బోర్డుదే అవుతుందని తేల్చిచెప్పింది.