: సమాజాన్ని కులం, మతం, ధనం ప్రభావితం చేయడం దురదృష్టకరం: వెంకయ్య నాయుడు
దేశంలో ఎలాంటి వారికైనా ఎదిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వెంకయ్యకు ఈ రోజు బీజేపీ నేతలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాన్య స్థితినుంచి మహోన్నత స్థాయికి ఎదిగిన ఎందరో మహానుభావులు దేశంలో ఉన్నారని చెప్పారు. సమాజాన్ని కులం, మతం, ధనం ప్రభావితం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణ, మార్పు అనే మంత్రం వేశారని, దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. మేక్ ఇండియా స్ట్రాంగ్ అనే నినాదంతో భారత్ నడుస్తోందని చెప్పారు. మతం, కులం వ్యక్తిగతమైన అంశాలని, వాటి కోసం తగువులు తగవని అన్నారు. లీడర్ అంటే పార్లమెంటు సమావేశాలని అడ్డుకోవడం కాదని, పనులకు ఆటంకాలు కలిగించే వాడు కాదని, నాయకుడు కావాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కూడా లేదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. సామాజిక స్పృహతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. పటేల్ చూపించిన మార్గంలో మనందరం నడుచుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మోదీ నాయకత్వంలో ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని చెప్పారు.