: యూకే కొత్త వీసా రూల్స్... భారతీయ ఐటీ ఉద్యోగులకు షాక్

తమ దేశంలోకి వస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతుండటంతో వీసా నిబంధనలను యూకే ప్రభుత్వం కఠినతరం చేసింది. యూరోపియన్ యూనియన్ కు చెందని వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనలు మన దేశానికి చెందిన ఐటీ నిపుణులకు శరాఘాతంగా మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం నవంబర్ 24 తర్వాత టైర్-2 ఐసీటీ (ఇంట్రా కంపెనీ ట్రాన్స్ ఫర్) కేటగిరీ కింద యూకే వీసాకు అప్లై చేసుకునే వారికి కనీస ప్రారంభ వేతనం 30 వేల పౌండ్లు ఉండాలి. ఇప్పటి వరకు ఇది 20,800 పౌండ్లుగా ఉంది. ఈ ఐసీటీ రూట్ ద్వారా యూకేలో అడుగుపెడుతున్నవారిలో భారతీయ ఐటీ నిపుణులే అధికంగా ఉన్నారని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ) తెలిపింది. అంతేకాదు, భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణుల్లో 90 శాతం మంది ఐసీటీ ద్వారానే వచ్చారని ఈ ఏడాది ప్రారంభంలో ఎంఏసీ గుర్తించింది. నిన్న సాయంత్రమే వీసాకు సంబంధించిన మార్పులను యూకే ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మూడు రోజుల భారత పర్యటనకు రానున్న తరుణంలో (ఆదివారం వస్తున్నారు) ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. తమ దేశంలో విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికే యూకే ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News