: ప్రేమికులను కలిపి, ఆపై భయంతో ముగ్గురు యువకుల ఆత్మహత్యాయత్నం


వారు ముగ్గురూ స్నేహితులు. తమ మరో స్నేహితుడు ఓ యువతిని ప్రేమిస్తే, ధైర్యంగా వాళ్లిద్దరినీ కలిపారు. హైదరాబాద్ వెళ్లండని చెప్పి రైలెక్కించేశారు. ఆపై పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేయగా, ఈ ముగ్గురినీ పిలిచి పారిపోయిన వారి జాడ చెప్పాలని హెచ్చరించి పంపారు. వారి కోసం తమను పోలీసులు హింసిస్తారేమోనన్న భయంతో వీరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కొసం కిశోర్, మద్దుల ఏసు, చిగురుపల్లి ఏసు, దొడిగర్ల వెంకటరత్నం స్నేహితులు. వీరిలో వెంకటరత్నం ప్రేమించిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ పెళ్లి ఇష్టంలోని ఆమె, భర్తను వదిలి వెంకటరత్నం దగ్గరికి రాగా, మిగతా ముగ్గురూ కలసి వారిని ఎలాగైనా కలపాలన్న ఉద్దేశంతో ఊరు దాటించారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మిత్ర బృందాన్ని విచారించి పంపారు. ఆపై ఎన్ని రోజులైనా ప్రేమ జంట ఆచూకీ లభించలేదు. దీంతో తమను పోలీసులు మరోమారు విచారణకు పిలిచి కొడతారేమోనన్న ఆందోళనతో, నిన్న మధ్యాహ్నం పురుగుల మందు తాగారు. ఆపై తమ మరో స్నేహితుడు నవీన్ కు సమాచారం ఇవ్వగా, నవీన్ ఈ ముగ్గురినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News