: సాధారణ స్థితిని ఎంతమాత్రమూ కోరుకోని పాకిస్థాన్: శివ శంకర్ మీనన్ కీలక వ్యాఖ్య
ఇండియాతో సాధారణ సంబంధాలను పాకిస్థాన్ ఎంతమాత్రమూ కోరుకోవడం లేదని, పాక్ రాజకీయాలు సైతం భారత్ తో శాంతిని నెలకొల్పేంత శక్తిని కలిగిలేవని మాజీ విదేశాంగ కార్యదర్శి శివ శంకర్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా పనిచేసిన ఆయన, ఇండియా- పాకిస్థాన్ మధ్య సంబంధాలపై న్యూయార్క్ యూనివర్శిటీ లోని దక్షిణాసియా సెంటర్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. కాశ్మీర్ కు సంబంధించిన ఎన్నో సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. సమస్యలకు పరిష్కారం తెలిసినా కూడా వాటిని చేపట్టలేకపోవడానికి కారణం, రాజకీయ కొట్లాటలేనని అన్నారు. ముంబై ఉగ్రవాదుల దాడుల తరువాత పాక్ తో శాంతి ప్రయత్నాలను భారత్ తగ్గించుకుంటూ వచ్చిందని శివ శంకర్ మీనన్ తెలిపారు. ఈ సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని అనుకోవడం లేదని అన్నారు.