: ఎస్సీ, ఎస్టీ చైర్మన్ గా కారెం శివాజీ ఎంపిక చెల్లదు... అపీలుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వకుండా హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఎంపిక చెల్లదని హైకోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. ఈ కేసులో కారెం శివాజీకి అపీలుకు వెళ్లే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. కేవలం మాల మహానాడు అనే సంఘానికి అధ్యక్షుడన్న అర్హతతో, ఇటువంటి కమిషన్ కు ఆయనను ఎంపిక చేయడం ఏంటని, ముందుగా నోటీసులు ఇచ్చి, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించి వారి నుంచి చైర్మన్ ను ఎంపిక చేయాలని సూచించింది. ఈ పదవికి అర్హతలు నిర్ణయించకుండా, ఎవరి నుంచీ దరఖాస్తులు తీసుకోకుండా ఇంత ముఖ్యమైన పదవికి ఓ వ్యక్తిని ఎలా నియమించారని ప్రశ్నించింది. సమర్థుడైన మరో వ్యక్తిని నియమించాలని ఏపీ సర్కారుకు సూచించింది. ఈ సందర్భంగా కారెం శివాజీ వ్యక్తం చేసిన అభ్యంతరాలనూ హైకోర్టు తోసిపుచ్చింది.