: తన డ్రైవర్ కోసం కారు డ్రైవర్ గా మారిన కలెక్టర్!
పెళ్లి వారి కారులా ఆ కారుకి అందమైన గులాబీలు అలంకరించివున్నాయి. దానిపైనున్న ఎర్రబుగ్గకు సైతం పూలు అలంకరించారు. సూటు బూటు ధరించిన ఓ వ్యక్తి ఆ కారుని నడుపుకుంటూ వచ్చి.. ఇల్లు చేరగానే కారు ఆపి, ముందుగా తాను దిగి.. వినయంగా వెనకవైపు డోర్ తీయగా, తెల్లని దుస్తులు, టోపీ ధరించిన ఓ వ్యక్తి బయటకు దిగాడు. అలా కారు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి మహారాష్ట్రలోని అకోలా కలెక్టర్ జి.శ్రీకాంత్ కాగా, ఇక కారు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి డ్రైవర్ దిగంబర్ థక్! 18 మంది కలెక్టర్ల వద్ద డ్రైవర్ గా పనిచేసిన దిగంబర్ పదవీ విరమణ తీసుకుంటున్న వేళ, శ్రీకాంత్ స్వయంగా అతనికి ఘన వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుని ఈ పని చేశారు. కలెక్టర్ కారు ఎందుకు నడిపారు అనుకుంటున్నారా? 58 ఏళ్ల దిగంబర్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. చివరిరోజు ఆఫీసులో అతడికి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. 18 మంది కలెక్టర్ల దగ్గర డ్రైవర్ గా పనిచేసిన దిగంబర్ కు విభిన్నంగా వీడ్కోలు పలకాలని కలెక్టర్ శ్రీకాంత్ భావించారు. దిగంబర్ ను వెనుక సీట్లో కూర్చొబెట్టుకుని స్వయంగా కారు నడుపుకుంటూ తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు కలెక్టర్. దాదాపు 35 సంవత్సరాల పాటు ఎంతో మంది కలెక్టర్ల వద్ద పనిచేసిన దిగంబర్ కు గుర్తుండిపోయేలా తుది పని దినం ఉండాలని తాను కోరుకున్నట్టు ఈ సందర్భంగా శ్రీకాంత్ వెల్లడించారు.