: డిన్నర్ త్వరగా చేయండి.. లేదంటే మానేయండి.. ఆరోగ్యానికి అదే మంచిదంటున్న అధ్యయనం
ఆహారం తీసుకోవడానికి సరైన సమయం ఏది? దీనిపై వేర్వేరు అభిప్రాయాలున్నాయి. అయితే ప్రస్తుత బిజీలైఫ్‌లో సమయపాలన లేని భోజనానికి అందరూ అలవాటు పడిపోయారు. ఏదో కడపులో కాసింత పడితే చాలు అన్నట్టు అయిపోయింది. వైద్యులు ఎంతగా మొత్తుకుంటున్నా ఎవరికి అనుకూలమైన సమయంలో వారు ఆహారం తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఉదయం పూట పుష్టిగా తిని రాత్రిపూట మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనేది చాలాకాలంగా వస్తున్న వాదన. ఇది నిజమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఒంట్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు రాత్రి భోజనం త్వరగా తీసుకోవాలని అమెరికా పరిశోధకులు సూచిస్తున్నారు. రాత్రివేళ కొద్దిపాటి ఆహారాన్ని తీసుకోవడంతో సరిపెట్టాలని లేదంటే పూర్తిగా మానేసినా ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆహారం తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటలు, ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆహారం తీసుకునే వారిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్టు వివరించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆహారం తీసుకునే వారిలో ఆకలి బాగుండడంతోపాటు కొవ్వు, పిండిపదార్థాలను శరీరం ఆరిగించుకునే ప్రక్రియలో మార్పు వచ్చినట్టు గుర్తించారు. అధికంగా ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు ఇది చక్కగా పనికొస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న కర్‌ట్నీ పీటర్ సన్ తెలిపారు. మన శరీరంలోని జీవక్రియలు ఉదయం పూట చాలా చురుగ్గా ఉంటాయని, కాబట్టి ఆ సమయంలో ఆహారం తీసుకోవడమే అత్యుత్తమమని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరోగ్యంపై చక్కని ప్రభావం చూపిస్తుందని వివరించారు.