: 4జీ లేకపోయినా, జియో ఉచిత కాల్స్... బేసిక్ ఫోన్ల అపరిమిత కాల్స్ ఆఫర్
చేతిలో 4జీ ఫోన్ లేని కారణంగా రిలయన్స్ జియో అపరిమిత ఉచిత కాల్స్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామని బాధపడుతున్న వారికి శుభవార్త. టెలికం రంగంలో మరో సంచలనానికి జియో సిద్ధమైంది. రూ. 1000 నుంచి రూ. 1500 మధ్య ఉండే బేసిక్ హ్యాండ్ సెట్లను విక్రయించి, వాటి ద్వారా జియో ఉచిత కాల్స్ సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తోంది. ఈ ఫోన్లలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వీఓఎల్టీఈ) సౌకర్యాన్ని చేర్చగలిగితే, అన్ని వర్గాలకూ చేరువ కావచ్చని జియో భావిస్తోంది. ఈ మేరకు టెలికం సంస్థలతో జియో చర్చలు సాగిస్తుండగా, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, ఈ నెలాఖరులోగానే జియోకు మద్దతిచ్చే ఫీచర్ ఫోన్స్ మార్కెట్లోకి వస్తాయి. లైఫ్ బ్రాండ్ పేరిట రూ. 2,999కి 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫోన్లను రిలయన్స్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బేసిక్ వీఓ ఎల్టీఈ ఫోన్లను పరిశీలిస్తున్నామని కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజా వెల్లడించగా, జియోతో తాము చర్చలు జరుపుతున్నామని ఇన్ ఫోకస్ వెల్లడించింది. వీడియోకాన్, శాంసంగ్ సంస్థలు తామిప్పుడే స్పందించలేమని తెలిపాయి.