: నేనూ మీతో కలుస్తాను.. ‘ఇండియా గేట్’ వద్ద నిరసన చేద్దాం పదండి: జేఎన్ యూ విద్యార్థులతో సీఎం కేజ్రీవాల్
‘మీకు అండగా నేనున్నాను. మీతో కలుస్తాను..‘ఇండియా గేట్’ వద్ద నిరసన చేద్దాం పదండి’ అంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ) విద్యార్థులతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ విద్యార్థి అయిన నజీబ్ ఇరవై రోజుల క్రితం రాత్రి సమయంలో కనిపించకుండాపోయాడు. సుమారు 20 మంది విద్యార్థులు అతని హాస్టల్ గది వద్దకు వెళ్లి చితకబాదారు. హాస్టల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం అక్కడికి వెళ్లిన సదరు విద్యార్థులు ఏబీవీపీకి చెందినవారనే ఆరోపణలు ఉన్నాయి. నజీబ్ పై దాడి జరిగిన అనంతరం అతను కనిపించకుండా పోయాడు. ఇంతవరకు పోలీసులు అతని జాడను కనుక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ విద్యార్థులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. నజీబ్ అహ్మద్ ఆచూకీ గురించి ఇంతవరకూ తెలియకపోవడంపై ఆయన మండిపడ్డారు. నజీబ్ ఆచూకీ కోసం విద్యార్థులంతా ఇండియా గేట్ ముందు బైఠాయించాలని, నిరసన తెలపాలని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారిని హతమార్చడం లేదా అదృశ్యమయ్యేటట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. సమాజాన్ని హిందూ, ముస్లింలుగా విడగొట్టాలని బీజేపీ చూస్తోందంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు.