: నా భర్త పాకిస్థానీ కాదు: బాలీవుడ్ హీరోయిన్ లిసా
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా బతకాలనుకున్న బాలీవుడ్ హీరోయిన్ లిసా హేడన్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. డినో లల్వానీతో ఏడాది పాటు డేటింగ్ చేసి, చివరకు అతడినే పెళ్లాడింది లిసా. అంతా బాగానే ఉంది కానీ, డినో లల్వానీ తండ్రి గులు లల్వానీ పాకిస్థాన్ లో జన్మించిన వ్యాపారవేత్త కావడంతో, అసలు సమస్య మొదలైంది. ఆమె భర్త పాకిస్థానీ అంటూ ఆమె వివాహంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన లిసా హేడన్... తన భర్త డినో పాకిస్థానీ కాదని ట్విట్టర్ ద్వారా తెలిపింది. తన మామ గులు లల్వానీ అవిభాజ్య భారత్ లోని కరాచీలో పుట్టారని.... ఇండియా నుంచి పాక్ విడిపోయిన తర్వాత భారత్ కు వచ్చేశారని చెప్పింది. ఆ తర్వాత బ్రిటన్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారని తెలిపింది. ప్రపంచమంతా ప్రేమనే కోరుకుంటుందని... ద్వేషాన్ని కాదంటూ తనపై విమర్శలు చేసినవారిపై అసహనం వ్యక్తం చేసింది. 30 ఏళ్ల లిసా హేడన్ చైన్నైలో జన్మించింది. మోడల్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ ఫుల్-3, క్వీన్, శాంటా బాంటా, యే దిల్ హై ముష్కిల్ లాంటి సినిమాల్లో నటించింది.