: పొంగల్ కావాలన్నా, కేసరీ బాత్ కావాలన్నా... ఒక్క బటన్ నొక్కితే చాలు... ఎన్ఐఈ మైసూరు వినూత్న సృష్టి
మీకు సడన్ గా పొంగల్ తినాలనిపించిందనుకోండి... ఏం చేస్తారు? ఏదైనా హోటల్ కు వెళ్లి తెచ్చుకుంటారు. లేదంటే ఇంట్లో చెప్పి మరుసటి రోజు చేయించుకుని తింటారు. అదే కాస్తంత పొంగల్, ఇంకాస్త కేసరీ బాత్ తినాలని ఒకేసారి అనిపిస్తే, అది కూడా ఏ పండగ పూటో కాకుండా మామూలు రోజుల్లో... నెరవేరడం కష్టమే కదా? ఈ రెండే కాదు, బిస్ బెల్లీ బాత్, పులిహోర వాంగీ బాత్, కర్డ్ రైస్ వంటి వెరైటీలన్నీ ఒకే చోట కనిపించాలంటే... హోటల్ లో తప్ప ఇండ్లలో సాధ్యం కాదు కదా? కానీ, మైసూరుకు చెందిన ఎన్ఐఈ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్) ఔత్సాహికుల బృందం క్లౌడ్ కంప్యూటింగ్ విధానాన్ని ఆధారం చేసుకుని తయారు చేసిన ఓ యంత్రంలో ఎటువంటి ఫుడ్ అయినా, తినేందుకు సిద్ధంగా ఉండే రూపంలో వస్తుంది. కాఫీ మెషీన్ లో కాపచీనో నొక్కితే కాపచీనో, టీ నొక్కితే టీ వచ్చినట్టుగా, ఈ మిషన్ లో ఏ బటన్ నొక్కితే, ఆ ఫుడ్ వచ్చేస్తుంది. ఈ యంత్రానికి ఇంకా పేటెంట్ లభించకపోవడంతో వర్శిటీ దీన్ని బయటకు మాత్రం చూపలేదు. న్యూఏజ్ ఇన్ క్యుబేషన్ నెట్ వర్క్ ప్రాజెక్టులో భాగంగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ లో నైపుణ్యం సాధించిన ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు జీ మదన్, కేశవ్ ప్రకాశ్ లు దీన్ని తయారు చేశారు. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, హార్డ్ వేర్ ప్రొటోటైప్ తదితరాలకు రూ. 15 వేల వరకూ ఖర్చు చేయగా, మార్కెట్లో విడుదల చేసే వర్షన్ వచ్చే సంవత్సరానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. అన్ని రకాల దక్షిణాది వంటకాలనూ అందించేలా దీన్ని తయారు చేసినట్టు ఎన్ఐఈ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ ఎంవీ అచ్యుతా వెల్లడించారు.