: ప్రభుత్వ సేవలు కావాలా? జేబు మరింత గుల్లవుద్ది!
మీరు పాస్ పోర్టు పొందాలని భావిస్తున్నారా? ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసి పరీక్ష రాస్తున్నారా? డ్రైవింగ్ లైసెన్స్ లేదా మరేదైనా ధ్రువపత్రాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారా?... ఇలా ఏదైనా సరే, ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవ అందుకున్నా అదనంగా రుసుములు వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ఖజానాకు మరింత నిధిని పోగు చేయడమే లక్ష్యంగా, బడ్జెట్ డిస్కషన్స్ ప్రారంభించిన ఆర్థిక శాఖ, సాధ్యమైనంత మేరకు సబ్సిడీ భారాన్ని ప్రభుత్వంపై పడకుండా చూడటమే తమ లక్ష్యమన్న సంకేతాలను పంపింది. ఉదాహరణకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఎన్నో ఏళ్లుగా రూ. 100 వసూలు చేస్తున్నారు. పలు రైల్వే పరీక్షలు సేవలూ భారీ సబ్సిడీపై అందుతున్నాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రకాల ప్రభుత్వ సేవల ఫీజులు పెరిగినా, అది పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా లేదన్నది నిపుణులు అభిప్రాయం. ఇక ఈ సంవత్సరం వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజలకు అందించే సేవలపై ఖజానాల నుంచి చెల్లించకుండా చూస్తూ, ఆయా సేవలకు ప్రజల నుంచే వసూలు చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని ఎక్స్ పెండచర్ మేనేజ్ మెంట్ కమిషన్ చేసిన సిఫార్సులకు త్వరలోనే ఆమోదం పడవచ్చని తెలుస్తోంది.