: రెండు సార్లు గర్భవతిని చేసి... భారీ కట్నం కోసం మరో పెళ్లికి సిద్ధమైన ఎస్సై
అత్యంత బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పాల్సిన ఓ పోలీసధికారి దారి తప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని రెండు సార్లు గర్భవతిని చేశాడు. గర్భం తీయించుకోవాలంటూ కొట్టి వేధించాడు. ఇప్పుడు భారీ కట్నంతో మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురానికి చెందిన ఎం.అరుణ (27) బీఏ, బీఈడీ చదివింది. వీరి కుటుంబానికి గ్రామంలోని వేరే కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ నేపథ్యంలో, తమకు న్యాయం చేయాలని కోరుతూ మూడేళ్ల క్రితం తన తల్లితో కలసి పలమనేరు డీఎస్పీకి వారు ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో, రామకుప్పం ఎస్సైగా పనిచేస్తున్న సునీల్ కుమార్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ తన నంబర్ అరుణకు ఇచ్చి, ఆమె నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు రెగ్యులర్ గా ఫోన్లు చేస్తూ, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన అరుణ... కొన్ని రోజుల తర్వాత గర్భవతి అయింది. ఆ సమయంలో గర్భం పోవడానికి మాత్రలు తెచ్చి మింగించాడు. ఇదే క్రమంలో రెండోసారి కూడా అరుణ గర్భం దాల్చింది. ఈ సారి కూడా సునీల్ గర్భస్రావం చేయించడానికి యత్నించాడు. దానికి నిరాకరించిన అరుణ... పెళ్లి చేకుందామని పట్టుబట్టింది. దీంతో, ఆమెను కొట్టి, బెదిరించి మాత్రలు మింగించాడు సునీల్. ప్రేమికుల రోజున కూడా ప్రేమకు చిహ్నం అంటూ ఆమె చైను, బ్రాస్ లెట్, ఉంగరం తీసుకెళ్లాడు. అంతేకాదు, తన స్వగ్రామం తప్పేటఓబాయిపల్లెలో ఇల్లు కడుతున్నామని చెప్పి, అరుణ నుంచి రూ. 20 లక్షలు కూడా తీసుకున్నాడు. ఈ డబ్బు ఇచ్చినట్టు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అరుణ చెబుతోంది. ఈ నేపథ్యంలో, గత నెల 15న ఎస్సై సునీల్, అతని తల్లిదండ్రులు, బావ, మరి కొందరు అరుణ ఇంటికి వచ్చి ఆమె తండ్రిని బెదిరించారు. సునీల్ కు వేరే అమ్మాయితో రూ.70 లక్షలకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పారు. దీంతో, ఆమె పలమనేరు డీఎస్పీ శంకర్ ను ఆశ్రయించింది. అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మరోవైపు తనపై విచారణ ఆపాలంటూ హైకోర్టు నుంచి సునీల్ స్టే తెచ్చుకున్నాడు.