: పెట్రోల్ నింపుకోండి... లేకపోతే ఇబ్బంది పడతారు
ఎందుకైనా మంచిది మీ వాహనాల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ ను ముందుగానే పట్టించుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ నెల 5వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్ బంకులు పనిచేస్తాయి. 6వ తేదీన పూర్తి స్థాయిలో బంద్ ఉంటుంది. ఈ విషయాన్ని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై ఆయిల్ కంపెనీలు మార్జిన్ పెంచాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ఆయిల్ కంపెనీలు వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. దీంతో, గురు, శుక్రవారాల్లో ఆయిల్ కొనుగోళ్లను తాము పూర్తిగా నిలిపివేస్తామని గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని 80 శాతం పెట్రోల్ బంకులను నష్టాల నుంచి కాపాడుకోవడమే తమ ఉద్దేశమని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే తాము ఆందోళన బాట పట్టామని ఆయన తెలిపారు.