: జయలలిత మళ్లీ మామూలయ్యారు.. త్వరలోనే పాలన ప్రారంభిస్తారు: ఏఐఏడీఎంకే
అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని, సాధారణ జీవితం గడుపుతున్నారని ఏఐఏడీఎంకే వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆమె పాలన ప్రారంభిస్తారని పార్టీ అధికార ప్రతినిధి పన్రుట్టి ఎస్.రామచంద్రన్ పేర్కొన్నారు. సెప్టెంబరు 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఆయన తెలిపారు. పేదల సేవకు త్వరలోనే మళ్లీ వస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. 'అమ్మ’కోసం ప్రజలు చేసిన ప్రార్థనలు ఊరికే పోవని అన్నారు. జయలలిత కోలుకున్నారని, అయితే మరికొంతకాలం నిపుణుల పర్యవేక్షణ అవసరమని వైద్యులు చెప్పినట్టు మరో అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ సెప్టెంబరు 22న ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 21న వైద్యులు చివరి సారిగా జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.