: అమరావతిలో ఒలింపిక్ పోటీల నిర్వహణకు వీలుగా క్రీడా ప్రాంగణాల అభివృద్ధి.. ఏపీ సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రతివారం నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. నిర్దేశించిన కాల పరిమితిలో పనులు పూర్తిచేయని కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. డిసెంబరు 2017 నాటికి రూ.3600 కోట్లతో నిర్మించ తలపెట్టిన 270 కిలోమీటర్ల ప్రధాన రహదారులు, వాటికి అనుబంధంగా నిర్మించనున్న 130 కిలోమీటర్ల పొడవైన రోడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనన్నారు. తాగునీరు, విద్యుత్, టెలిఫోన్, వంటగ్యాస్, డ్రైనేజీ తదితర వాటికి సంబంధించిన అన్ని పైపులైన్లు భూగర్భంలోనే ఉండాలని, ఈ విషయంలో సింగపూర్ నమూనాను అధ్యయనం చేయాలని సూచించారు. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హోటళ్లను ఒకే ప్రాంతంలో కాకుండా అమరావతి నలుమూలలా ఉండేలా చూడాలన్నారు. 2018లో అమరావతిలో జాతీయ క్రీడోత్సవాలు జరిపేందుకు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని ఆదేశించిన చంద్రబాబు భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు వీలుగా క్రీడా ప్రాంగణాలను అప్‌గ్రేడ్ చేసుకునేలా నిర్మించాలని ఆదేశించారు. రాజధానిలో అడుగడుగునా పచ్చదనం తొణికిసలాడాలని, నదీతీరంలో, కాల్వల వెంబడి మొక్కలు పెంచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.