: అవును, సిమీ ఉగ్రవాదులను కాల్చినప్పుడు వారి వద్ద ఆయుధాలు లేవు.. అయితే ఏంటీ?: యాంటీ-టెర్రర్ స్క్వాడ్ ఉన్నతాధికారి
'మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న సిమీ ఉగ్రవాదులను కాల్చిపారేసినప్పుడు వారి వద్ద ఆయుధాలు లేవు, అయితే ఏంటీ?' అని ఆ రాష్ట్ర యాంటీ-టెర్రర్ స్క్వాడ్ ఉన్నతాధికారి సంజీవ్ షమి ప్రశ్నించారు. సిమీ ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసినప్పుడు వారి వద్ద ఆయుధాలు లేవని అంతకుముందే చెప్పానని, ఆ మాటపై తాను నిలబడతానని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఆయుధాలు వాడొచ్చని, అవసరమైతే నేరస్తులను కాల్చేయవచ్చనే విషయం చట్టంలో ఉందని అన్నారు. తాము ఎన్ కౌంటర్ చేసిన వ్యక్తులు చాలా ప్రమాదకర నేరస్తులని అన్నారు. నేరస్తులను అదుపులోకి తీసుకునే విషయమై ఒకవేళ పోలీసులు ఆలోచిస్తూ కూర్చుంటే కనుక వారు పారిపోవడమో లేక తమపై ఆయుధాలు ప్రయోగించడమో జరిగేదన్నారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, జైళ్ల శాఖ మంత్రి కూడా ఈ ఎన్ కౌంటర్ సబబేనని ప్రకటించడం విదితమే.