: బస్సును చూడండి... ముట్టుకోవద్దు: మీడియాకు సూచించిన అఖిలేష్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెరలేపారు. 'వికాస్ యాత్ర' పేరుతో రేపట్నుంచి ఆయన ప్రచారం మొదలుకాబోతోంది. ఈ యాత్ర కోసం ఆయనకు ఓ ప్రత్యేక బస్సు రెడీ అయింది. పది చక్రాల ఎర్రటి మెర్సిడెస్ బస్సును తన యాత్ర కోసం ఆయన సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రత్యేక బస్సు నిన్న ఆయన అధికార నివాసానికి చేరుకుంది. తన ప్రచార యాత్ర జరిగినన్ని రోజులు ఆయన ఈ బస్సులోనే బస చేయనున్నారు. ఇక ప్రచారం చేయడానికి వీలుగా బస్సులో హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. బస్సు చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లోపల సోఫాలు, బెడ్, ఎల్సీడీ టీవీలను అమర్చారు. బస్సుకు ఓ వైపు సైకిల్ తొక్కుతున్న అఖిలేష్ ఫొటోను, మరోవైపు అఖిలేష్ పాలనలో చేపట్టిన పథకాలకు సంబంధించిన వివరాలను అతికించారు. ముందువైపు సమాజ్ వాది పార్టీ చిహ్నం సైకిల్ ను అతికించారు. వెనకవైపున తన తండ్రి ములాయం, బాబాయి శివపాల్ యాదవ్ ఫొటోలను అతికించారు. లక్నోలోని పార్టీ కార్యాలయానికి కూడా నిన్ననే ఆ బస్సును తీసుకెళ్లారు. ఈ బస్సును చూడటానికి మీడియా ప్రతినిధులే కాకుండా, సామాన్య ప్రజలు కూడా ఎగబడ్డారు. బస్సును మీడియా ప్రతినిధులు ఫొటో తీస్తుండగా... 'బస్సును చూడండి, కానీ ముట్టుకోకండి' అని అఖిలేష్ సూచించారు.