: నయీమ్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్పా: ఆర్.కృష్ణయ్య
ఇటీవలే ఎన్ కౌంటర్ కు గురైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను ఈ రోజు విచారించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కృష్ణయ్యను సిట్ ఐజీ నాగిరెడ్డి దాదాపు గంటసేపు విచారించారు. మాదాపూర్ భూవివాదంపై ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ, తనకు తెలిసిన విషయాలన్నింటినీ పోలీసులకు తెలిపానని చెప్పారు. మరోవైపు నయీం తనను గురువుగా భావించేవాడని గతంలో కృష్ణయ్య తెలిపారు. నయీం గురించి తనకు అంతా తెలుసని... కానీ, అతని నేరాలతో తనకు సంబంధం లేదని చెప్పారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో ఉన్నప్పటి నుంచి నయీమ్ తన వద్దకు వచ్చేవాడని... విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు తాను మద్దతు ఇచ్చే వాడినని... ఈ క్రమంలో నయీం తనకు దగ్గరయ్యాడని తెలిపారు.