: జైలు కంటే కాంగ్రెస్ పార్టీ సురక్షితమని సిమీ ఉగ్రవాదులు భావించి ఉంటారు: బీజేపీ
భోపాల్ నగర శివార్లలో సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు బీజేపీ దీటైన జవాబిచ్చింది. ముస్లింలు మాత్రమే జైలు నుంచి పారిపోతారా? అంటూ ఈ ఎన్ కౌంటర్ విషయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విజయవాడ వచ్చిన సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ... జైలు కంటే కాంగ్రెస్ పార్టీయే తమకు సురక్షిత ప్రదేశమని సిమీ ఉగ్రవాదులు భావించి ఉంటారని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదానికి మతం రంగు పులమడాన్ని ఆయన తప్పుబట్టారు. సిమీ ఉగ్రవాదులపై చూపిస్తున్న సానుభూతి, వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ విషయంలో ఎందుకు చూపించడం లేదని విమర్శలు చేస్తున్నవారిని ప్రశ్నించారు.