: భార్యలను వదిలేసిన 50 మంది తెలంగాణ ఎన్నారైలు.. మహిళా కమిషన్ వెల్లడి
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వీరి ధనదాహం తీరడం లేదు. పెళ్లి సమయంలో భారీ కట్నాలను తీసుకొని... ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తున్న ఎన్నారైల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ మహిళా కమిషన్ వెల్లడించిన ఓ చేదు నిజం ఎలాంటి వారినైనా కలచివేసేలా ఉంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ ఏకంగా 200 మంది ఎన్నారై భర్తలు తమ భార్యలను వదిలేశారట. వీరిలో అత్యధికంగా 50 మంది తెలంగాణ ఎన్నారై భర్తలు ఉన్నారట. ఈ వివరాలను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం వెల్లడించారు. ఇలాంటి వరకట్న వేధింపుల కేసులను యూకే, అమెరికా, యూఏఈ కోర్టులు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లోని భర్తలను భారత్ కు రప్పించడం కష్టసాధ్యంగా మారిందని త్రిపురాన తెలిపారు. ఎన్నారై వివాహాలపై ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నారైలను పెళ్లాడే అమ్మాయిలు విదేశాల్లోని చట్టాలతో అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. వివాహ చట్టాలపై అవగాహన పెంచేందుకు ఈ నెల 5న హైదరాబాదులో సదస్సును నిర్వహించనున్నామని తెలిపారు.