: జమ్ముకశ్మీర్‌లో పాఠశాలలను తగులబెట్టడం దారుణం: వెంకయ్యనాయుడు
జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉగ్రవాదులు, వేర్పాటువాదులు 26 పాఠశాలలను తగులబెట్టడం దారుణమని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతూ వేర్పాటు వాదులు వారి పిల్లల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వేర్పాటు వాదులు తమ పిల్లల భవిష్యత్ గురించి పట్టించుకోవాలని సూచించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా, జమ్ముకశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్ వోరా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకించి విద్యా సంస్థల పునఃప్రారంభంపై రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.