: త్వరలో రెట్టింపు వేతనం అందుకోనున్న ఎంపీలు
త్వరలో పార్లమెంటు సభ్యులు రెట్టింపు వేతనాన్ని అందుకోనున్నారు. ప్రస్తుతం ఎంపీలకు బేసిక్ వేతనం రూ.50 వేలుగా ఉంది. దీన్ని రూ.లక్ష చేయాలని కేంద్రం నిర్ణయించింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని వేతనాలు, భత్యాలపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఎంపీల వేతనానికే పరిమితం కాకుండా వారి అలవెన్స్ లను కూడా సవరించనున్నట్టు తెలిపింది. రాష్ట్రపతి వేతనం నెలకు రూ.1.5లక్షలు ఉండగా, దాన్ని రూ.5 లక్షలు చేయాలని, గవర్నర్ల వేతనం రూ.1.10 లక్షలు ఉండగా దాన్ని రూ.2.50 లక్షలకు పెంచాలని కూడా కేంద్రం భావిస్తోంది.