: పవన్ కల్యాణ్ ‘జనసేన’తో మేము జతకట్టలేదు: సిద్ధార్థ్నాథ్ సింగ్
సినీ హీరో పవన్ కల్యాణ్ గత ఎన్నికల సమయంలో తమకు మద్దతు మాత్రమే తెలిపారని, ఆయన స్థాపించిన జనసేన పార్టీతో తాము జతకట్టలేదని భారతీయ జనతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఏపీ అధికార పార్టీ టీడీపీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తమ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న ర్యాలీ నిర్వహించనుందని, అందులో తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను సిద్ధార్థ్నాథ్ సింగ్ తిప్పికొడుతూ ఆ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరేందుకే ఉగ్రవాదులు జైల్లో నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఆ ఎన్కౌంటర్ను కాంగ్రెస్ రాజకీయం చేస్తూ వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు.