: అవ్వ మాటలతో చంద్రబాబు ఖుషీ.. జన చైతన్య యాత్రలో జనంతో సీఎం మమేకం
జన చైతన్య యాత్రల తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖుషీగా గడిపారు. జనంతో మమేకమయ్యారు. కొప్పోలులో యాత్ర ప్రారంభం అనంతరం సీఎం కాలినడకన పర్యటించారు. దారిపొడవునా కనిపించిన వారిని చిరునవ్వుతో పలకరించారు. ఈ సందర్భంగా ఉమ అనే వృద్ధురాలితో మాటలు కలిపారు. ‘‘ఏం పెద్దమ్మా పింఛన్ సక్రమంగా అందుతోందా?’’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ ‘‘ప్రతినెల పింఛను వస్తోందయ్యా’’ అని బదులిచ్చింది. ఆమె మాటలకు సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు పిల్లలు ఎంతమందని ఆరా తీశారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, బతుకు తెరువు కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వారు అప్పుడప్పుడు వచ్చి పోతుంటారని పేర్కొంది. వారొచ్చినా రాకపోయినా నువ్వు ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛనుతో ఎవరిమీదా ఆధారపడకుండా బతుకుతున్నానని చెప్పడంతో చంద్రబాబు ఆనందంతో నవ్వులు చిందించారు.