: ప్రజల వ్యక్తిగత వికాసం కోసం 15 సూత్రాలు.. రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు: చంద్రబాబు
టీడీపీ మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని కొప్పోలు దళితవాడలో మంగళవారం జనచైతన్య యాత్రను ప్రారంభించిన అనంతరం 15 సూత్రాల ప్రగతి ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశారని కొందరు అడుగుతున్నారని, తమ మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. ప్రజల వ్యక్తిగత వికాసం కోసం చేపట్టిన 15 సూత్రాల కార్యక్రమం అన్ని గ్రామాల్లో అమలు కావాలని అన్నారు. అవి సాధించే వరకు విశ్రమించొద్దని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. 2029 నాటికి సంతోషాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ దివాళాకోరు పార్టీ అని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని, ప్రజలు టీడీపీకి అండగా నిలవాలని కోరారు. టీడీపీ 15 సూత్రాలు ఇవే.. పింఛన్లు, ఆహార భద్రత, చంద్రన్న బీమా, అందరికీ నాణ్యమైన విద్యుత్, జూన్ నాటికి అన్ని ఇళ్లకూ గ్యాస్, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, ఆరోగ్య భద్రత, అందరికీ విద్య, నీటి భద్రత, ఇంటి భద్రత, 50 శాతం సబ్సిడీతో ఇంటి వద్దకే పశుగ్రాసం, పనిచేస్తామన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పన, వైజ్ఞానిక సమాజంగా రాష్ట్రం, వ్యక్తిగత భద్రత, ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయం వచ్చేలా చర్యలు.