: కలకలం రేపిన బలిమెల రిజర్వాయర్ లోని మృతదేహం!
ఏవోబీలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ రోజు బలిమెల రిజర్వాయర్ లో ఓ మృతదేహం కనిపించడం అలజడి సృష్టించింది. ఈ మృతదేహాన్ని చూసిన స్థానికులు మొదట అది ఓ మావోయిస్టుదిగా భావించారు. అంతేగాక, అక్కడ రెండు మృతదేహాలు కూడా ఉన్నాయని పుకార్లు వచ్చాయి. అనంతరం స్థానికులు ఈ సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. అయితే ఈ మృతదేహం చింతల్‌పాంగీ గ్రామానికి చెందిన వ్యక్తిదిగా పలువురు గుర్తించారు. ఆ వ్యక్తి వారం రోజుల క్రితం రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఏవోబీలో ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి మావోయిస్టు నేత రామకృష్ణ (ఆర్కే) కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తాజాగా కనిపించిన ఈ మృతదేహం గురించి అసలు విషయం తెలియక ముందు వరకు అది అర్కేదే అని కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.