: టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 రాస్తున్నారా? బూట్లు, నగలు, చెవిపోగులు, గడియారాలపైనా నిషేధం... నిబంధనలివే!
ఈ నెల 11, 13 తేదీల్లో టీఎస్ పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 1,032 పోస్టులకు గాను 7,89,985 మంది పోటీపడుతుండగా, 1,911 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 11వ తేదీన పేపర్ 1, 2; 13వ తేదీన పేపర్ 3, 4 పరీక్షలు జరగనుండగా, వీటిని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామంటూ టీఎస్ పీఎస్సీ పలు సూచనలను చేసింది. * అభ్యర్థులు బూట్లు ధరించి రాకూడదు. ఎలాంటి నగలు, చెవిపోగులు, చేతి గడియారాలను అనుమతించరు. * ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగరిథమ్స్ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, పుస్తకాలు వంటి వాటిపై నిషేధం ఉంటుంది. * చేతి వేళ్లపై గోరింటాకు ఉండకూడదు. ఇంక్ మరకలున్నా అనుమతించరు. * అందరు అభ్యర్థులూ విధిగా హాల్ టికెట్ తోపాటు మరో ఫొటో గుర్తింపు కార్డు తేవాలి. * హాల్ టికెట్ పై ఫొటో సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తేవాలి. * పరీక్ష జరిగే నాడు ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించరు. * తనిఖీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల వేలి ముద్ర, ఫొటో తీసుకుంటారు. * ఓఎంఆర్ పత్రాన్ని నీలం లేదా నలుపు రంగు బాల్ పాయింట్ పెన్నుతోనే నింపాల్సి వుంటుంది. * పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్‌తో రాసిన జవాబు పత్రాలను పరిశీలించరు. * ఒరిజినల్ ఓఎంఆర్ పత్రంతో బయటకు వెళితే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.