: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయి... కేసీఆర్ పరిపాలనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి: కేటీఆర్
ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... సింగిల్ విండో విధానంతో 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానాన్ని అందరూ ప్రశంసించారని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని అందరూ అనుమానం వ్యక్తం చేశారని, రెండున్నరేళ్లలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా అన్ని చర్యలు చేపట్టామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయని, కేసీఆర్ పరిపాలనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని అన్నారు. తెలంగాణలో 22 ప్రభుత్వ శాఖలు ఎంతో సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళుతోందని చెప్పారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కేసీఆర్ సంస్కరణలతో నవ తెలంగాణ పురోగతి సాధించిందని పేర్కొన్నారు. పెట్టుబడుల అనుకూలతలో తెలంగాణ 98.78 శాతం సాధించిందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 58 జీవోలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో రకాల సంస్కరణలు చేశామని అన్నారు. రాష్ట్రంలో లక్షా 61 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని అన్నారు.